Saturday, July 25, 2009

1954లోనే దాసరి సుబ్రమణ్యం జానపద ఇంద్రజాలం

దాసరి సుబ్రహ్మణ్యం గారు ... మూడుతరాల చందమామ పాఠకులను అద్భుతలోకాల్లో విహరింపజేసిన సాహితీ స్రష్ట... జానపద సీరియళ్ళకు అపూర్వంగా రూపకల్పన చేసిన మేటి రచయిత. ప్రముఖ తెలుగు బ్లాగర్ వేణు గారు అన్నట్లుగా దాదాపు పాతికేళ్లపాటు "చందమామ పాఠకులను తన అసమాన కల్పనా చాతుర్యంతో దుర్గమ అరణ్యాల్లోకీ, దుర్గాల్లోకీ, లోయల్లోకీ, సముద్రాల్లోకీ, మంత్రాల ద్వీపాల్లోకీ, మాయా సరోవరాల్లోకీ తీసుకువెళ్ళి, ఊహల స్వర్గంలో విహరింపజేసి ఉర్రూతలూగించిన కథల మాంత్రికుడు" దాసరి సుబ్రహ్మణ్యం గారు.

"‘చందమామ’ పత్రికను తల్చుకోగానే చప్పున గుర్తుకొచ్చే కథలు ఏవి అంటే.. శిథిలాలయం, రాతి రథం, యక్ష పర్వతం, మాయా సరోవరం; ఇంకా... తోకచుక్క, ముగ్గురు మాంత్రికులు, కంచుకోట లాంటి ఉత్కంఠ భరిత జానపద ధారావాహికలు మదిలో మెదుల్తాయి. ఖడ్గ జీవదత్తులూ, జయశీల సిద్ధ సాధకులూ, ఏకాక్షీ చతుర్నేత్రులూ... ఇలా ఒక్కొక్కరే జ్ఞాపకాల వీధుల్లో పెరేడ్ చేస్తారు; మైమరపించేస్తారు." వీటి సృష్టికర్త దాసరి సుబ్రహ్మణ్యం గారే.

"కాల భుజంగ కంకాళాలనూ, నరవానర నల్లగూబలనూ, గండ భేరుండ వరాహ వాహనాలనూ, మంత్ర తంత్రాల మాయాజాలాన్నీ సృష్టించి తెలుగు వారినీ, అనువాద రూపంలో ఇతర భారతీయ భాషల చదువరులనూ సమ్మోహనపరిచిన" తెలుగు కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గారు.

జానపద సీరియళ్ళకు అపూర్వంగా రూపకల్పన చేసిన సుబ్రహ్మణ్యం గారు భారతీయ కథకులలో అగ్రగణ్యులు. ప్రపంచానికి హ్యారీ ప్యాటర్లు, స్పైడర్ మేన్లు, తెలియని కాలంలోనే, 'తోకచుక్క'తో 1954లో మొదలైన ఆయన జానపద ఇంద్రజాలం 1978లో 'భల్లూక మాంత్రికుడు' వరకూ దాదాపు అవిచ్ఛిన్నంగా కొనసాగింది. ‘తోకచుక్క’ దగ్గర్నుంచి ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ అద్భుత కథలను తీర్చిదిద్దిన సుబ్రహ్మణ్య సృష్టి - చందమామ లోని ఈ ధారావాహికలు!

చందమామలో ఆయన రాసిన ఆ పన్నెండు సీరియల్స్ 24 సంవత్సరాలపాటు వరుసగా రాసినవి. ఖడ్గవర్మ, జీవదత్తు, జయశీలుడు, సిద్ధ సాధకులూ, ఏకాక్షీ చతుర్నేత్రులూ వంటి పాత్రలతో రెండు,లేదా మూడు తరాల పిల్లలకు బాల్యపు హీరోలను అందించిన మేటి రచయిత సుబ్రహ్మణ్యం గారు. ‘తోకచుక్క’ దగ్గర్నుంచి ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ అద్భుత కథలను తీర్చిదిద్దిన ఈయన చందమామలో యాబై నాలుగేళ్ళు పాటు (2006వరకూ) పనిచేసి, ఉద్యోగ విరమణ చేశారు. చందమామలో ప్రారంభం నుంచి మాంత్రికులు, దెయ్యాలు, భూతాలు, పట్టువదలని విక్రమార్క భేతాళులు వంటి బాల్య జీవితాన్ని సమ్మోహనపరుస్తూ వచ్చిన కథలు, ధారావాహికలు అచ్చవుతూ వస్తున్నప్పటికీ దాసరి సుబ్రహ్మణ్యం గారి పన్నెండు ధారావాహికలు తెలుగు జాతికి, పిల్లలకు, పెద్దలకూ కథల రూపంలో అమృతాన్ని అందించాయంటే అతిశయోక్తి కాదు. వరుస క్రమంలో కాకపోయినప్పటికీ, ప్రింట్ చందమామ, ఆన్‌లైన్ చందమామల మధ్య సాంకేతిక సమన్వయం కుదిరిన మేరకు సుబ్రహ్మణ్యంగారి అలనాటి ధారావాహికలను ఒక్కటొకటిగా ఆన్‌లైన్‌లో ప్రచురించబోతున్నారు.చందమామ కధ వీక్షకులకు ఇదో గొప్ప సదవకాశం ఆన్ లైన్ లోను దాసరిసుబ్రమణ్యం కధలు చదువుకోవచ్చు.



2 comments:

  1. I have read most of the serials written by shri dasari subrahmanyam in chandamama(telugu) from 1960's. His stories are well enjoyed by not only by children but also by senior citizens. Hope to see him with good health and continues to write to telugu readers.

    ReplyDelete
  2. yaa that's wright dasari subramanyam is a great writer all citizens enjoy's is stories is stories now in online that's nice to enjoy is stories

    ReplyDelete