Wednesday, July 22, 2009

భయం-ఒక కోతుల గుంపు

శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యులలో అగ్రగణ్యుడూ, చాలా సుప్రసిద్ధుడూ అయిన స్వామి వివేకానంద (1862-1902) పూర్వాశ్రమ నామం నరేంద్రనాథ్. విలక్షణమైన తమ ఆధ్యాత్మిక వారసత్వాన్ని గుర్తించేలా భారత ప్రజలను తట్టిలేపే గురుతర బాధ్యతను ఆయన తన లక్ష్యంగా స్వీకరించాడు. చికాగోలో(1893) జరిగిన విశ్వమత సమ్మేళనంలో ఇచ్చిన ఉద్వేగ భరితమైన ఉపన్యాసం ద్వారా పాశ్చాత్య ప్రపంచం భారతదేశ మహొన్నత ఆధ్యాత్మిక జ్ఞనసంపదను గ్రహించేలా చేశాడు.

తన గురువు శ్రీ రామకృష్ణపరమహంస పరమపదించాక, ఆయన సందేశాన్ని దేశ ప్రజల వద్దకుతీసుకువెళ్ళడానికి యువకుడైన స్వామి వివేకానంద దేశం నాలుగు చెరగులా తిరిగి వచ్చాడు. ఆ కాలఘట్టంలో ఒక నాడాయన వారణాసి సమీపంలో నిర్మానుశ్యంగా ఉన్న బాటలో ఒంటరిగా నడిచి వెళుతున్నాడు. అప్పుడు భయంకరమైన కోతల గుంపు ఒకటి ఆయన వెంటబడింది. ఆయన వాటికి దూరంగా పరిగెత్తసాగడు. అయినా కోతులంత వేగంగా ఆయన ఎలా పరిగెత్తగలడు? ఆయనకూ, కోతుల గుంపుకూ ఉన్న మధ్య దూరం తగ్గుతూ రావడంతో ఆయనలో భయం పుట్టింది హఠాత్తుగా, "పరిగెత్తవద్దు. మృగాల్ని ఎదుర్కో," అన్న కంఠస్వరం వినిపించింది. వివేకానంద పరిగెత్తడం ఆపి, అక్కడే నిలబడి, కోతుల కేసి కోపంగా తిరిగి చూశాడు. బెదిరిపోయిన కోతులు ఠక్కున ఆగిపోయాయి. చూస్తూండగానే అవి మెల్లగా వెనుక్కు తగ్గి, వచ్చిన దారినే వెళ్ళి పోయాయి. దారిపక్కన కూర్చుని సమయానికి తనకు చక్కని సలహా ఇచ్చిన సాధువుకు కృతజ్ఞతలు తెలియ జేశాడు వివేకానంద.



No comments:

Post a Comment