Sunday, July 19, 2009
బాలివుడ్ సంగీతంలో వజ్రం: యే జిందగీ ఉసీకి హై
కొన్ని పాటలు కొందరు పాడితేనే రస స్ఫోరకంగా ఉంటాయి. ఆ పాటకోసమే ఆ గాయనీ గాయకులు పుట్టారా లేదా వారికోసమే ఆ పాట పుట్టిందా అనేంతగా పాటా గాయకులు మమేకం అయిపోయిన సందర్భాలు సినీ సంగీతంలో కో కొల్లలు. హిందీ చలన చిత్ర సంగీత స్వర్ణయుగంలో వచ్చిన అలాంటి అపరూపమైన పాటల్లో యే జిందగీ ఉసీకి హై పాట ఒకటి. యే జిందగీ ఉసీకి హై ప్రియుడు తప్ప ఈ ప్రపంచంలో మరేదీ తనకు అవసరం లేదని ఒక ప్రియురాలు ఏకాంతంలో రాసిచ్చిన అపురూప దఖలు పత్రం ఈ పాట. జీవితం ఇలా సాగాలని, ఇలా బతకాలని మధురోహలు పెట్టుకుని, కలలు కని, అవి భగ్నమైన వారి జీవితాలను ఈ పాట ఎంత శోకమయంగా పలకరిస్తుందో... ఈ పాట నాటి సంగీత దర్శకుడు సి రామచంద్ర స్వరకల్పనలో ఏ మంగళప్రద ఘడియలో లతా మంగేష్కర్ గాంధర్వ గాత్రంనుంచి వెలువడిందో కానీ గత ఆరు దశాబ్దాలుగా హిందీ పాటల శ్రోతల హృదయాలను అది మలయ సమీరంగా వెంటాడుతూనే ఉంది. జీవితమే సఫలమూ రాగసుధా భరితమూ అనే తెలుగు అనార్కలి సినిమాలోని పాటకు ఇది హిందీ మాతృక. ఆ నాటి హిందీ సినిమా సంగీత దర్శకులలో ఉన్నత శిఖరాలమీద నిలిచి ఉన్న సి రామచంద్ర ఈ పాటను లత చేత పాడించాలని తలచిన క్షణం సినిమా సంగీతలోకంలో ఒక గాన రేరాణికి పట్టం కట్టింది. గాయనీ గాయకుల్లోని శక్తి సామర్థ్యాలను అంచనా వేయడంలో అఖండుడైన సి రామచంద్ర ఈ పాటకు లతను ఎన్నుకున్న నేపథ్యం విలక్షణమైంది. యాభయ్యవ దశకంలో హిందీ చలన చిత్రరంగంలో దేదీప్యమానంగా వెలిగిన మెలోడీ సంగీత సౌధానికి పునాది రాళ్లుగా నిలిచిన నలుగురు సంగీత దర్శకుల్లో సి రామచంద్ర అగ్రగణ్యుడు. మిగతా ముగ్గురు అనిల్ బిశ్వాస్, మదన్ మోహన్, రోషన్. దేశ విదేశాలకు సంబంధించిన ఏ సంగీత రూపాన్నయినా సినిమా సంగీతంలోని ఒడుపుగా తర్జుమా చేసుకుని దానికి భారతీయ ముద్రను ఒద్దిగా అద్దే రూపశిల్పి రామచంద్ర. పాటకు మంచి బాణీ కట్టడమే కాదు... గాయనీ గాయకుల ప్రతిభా పాటవాలను అంచనా వేసి, వారి స్వరపేటికలోని మంచిచెడ్డలను ఇట్టే పట్టేయడంలో రామచంద్ర అఖండుడు. సినిమాలకు వచ్చిన తొలిరోజుల్లో ఆనాటి అమర గాయక నటి నూర్జహాన్ ప్రభావానికి అమితంగా గురైన లతను దారి మళ్లించి లతగానే నిలబెట్టిన ఘనుడు రామచంద్ర. ఈ క్రమంలో లత గాన భవిష్యత్తుకు రామచంద్ర తన నిరాలా -1950-, సర్‌గమ్ -1950-, పర్‌చాయి -1952-, షిన్ షినాకి బూబ్లబూ - 1952- సినిమాలు లతా, రామచంద్ర జంటను పాపులర్ చేస్తే, 1953లో వచ్చిన అనార్కలి చిత్రం ఈ జంటను శిఖరాగ్రానికి చేర్చింది. అలనాటి హిందీ చిత్రం అనార్కలిలో లతా గొంతులోంచి జాలువారిన రామచంద్ర పాటలు విన్న శ్రోతలు సీ రామచంద్ర మహాప్రభో అని ఆనంద భాష్పాలు విడిచేవారట. అయితే ఒక గాయని సినీ గాన భవిష్యత్తును ప్రభావితం చేసిన అనార్కలి సినిమాలో పాటలకు లతాను ఎన్నుకోవడంలోనే రామచంద్ర గొప్పతనం దాగి ఉందంటారు విమర్శకులు. అది బొంబాయి సినిమా పరిశ్రమ గీతాదత్ గోము పాటలనే తలచుకుని గుటకలు వేస్తున్న కాలం. అనార్కలి సినిమాలో కూడా ఆమె చేతనే పాటలు పాడిద్దామని అంతా అనుకుంటే రామచంద్ర మాత్రం లతా అని అన్నాడట. ఎంత ఖచ్చితంగా అంటే ఇంకెవ్వరూ నోరెత్తలేనంతగా చెప్పాడు. ఇంకేముంది. దాని తర్వాత అంతా చరిత్రే మరి.
Labels:
hindi music,
music,
old hindi melodies,
old hindi songs
Subscribe to:
Post Comments (Atom)
naaku chaalaa iShtamaina pATallO idi okaTanDi.gurtu chesaaru.dhanyavAdalu.ee paata 2nd part kUDaa baagunTumdandi.ee zindagii usi ki hai..jo pyaar hi mein kho gaya.."ani unTumdi.
ReplyDeleteఆహా... ఎంత మంచి పాట గుర్తు చేసారు !!! ఈ రోజు ఆ పాటను download చేసుకుని వింటేగాని కుదర్దు. :)
ReplyDeleteఎంత హృద్యంగా పాడిందో లత ఈ పాట. లత పాటల్లో ఒక ఆణిముత్యం! హిందీ సినిమా దర్శకుల్లో సి. రామచంద్ర బాణీలు ప్రత్యేకంగా తెలిసిపోతూ ఉంటాయి, బహుశా రాగాల ఎన్నిక వల్ల అనుకుంటా! తెలుగులో ఎమ్మెస్ విశ్వనాథన్ బాణీల్లాగా! నా MP3 ప్లేయర్ లో హిందీ పాటల్లో మొదట కాపీ చేసింది ఈ పాటనే! జీవితమే సఫలమూ పాట కూడా బాగానే ఉన్నా, ఈ పాటలో ఉన్న సౌకుమార్యం, మార్దవం ఆ పాటలో తోచదు. ఎంతైనా ఒరిజినల్ ఒరిజినలే కదా!
ReplyDeleteమీ విశ్లేషణ వివరణ ఎంత బావుందంటే అర్జెంటుగా ఆ పాట ఇప్పుడే వింటూ ఈ వ్యాఖ్య రాస్తున్నాను. అంత బావుంది. ధన్యవాదాలు!