Wednesday, September 30, 2009

దాదా సాహెబ్‌ఫాల్కె అవార్డు

2007 సంవత్సరానికిగాను ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ఫాల్కె అవార్డును సినీ నేపథ్య గాయకుడు మన్నాడేను వరించింది. సినీరంగంలో విశిష్ట సేవలందించిన వారికి ఇచ్చే అత్యున్నత పుస్కారమిది.

ఐదుగురు సభ్యులతో కూడిన కమిటి మన్నాడే పేరును ఖరారు చేసినట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు తెలియజేశారు. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ చేతుల మీదుగా అక్టోబర్‌ 21న ఈ అవార్డును మన్నాడే అందుకుంటారు. పూర్ణచంద్ర, మహామాయ డే దంపతులకు 1919 మే 1వ తేదీన కోల్‌కతాలో మన్నాడే జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు ప్రబోధ్‌ చంద్ర డే. 1950 నుంచి 1970 మధ్యకాలంలో ఆయన ఆలపించిన గీతాలతో హిందీ చిత్రపరిశ్రమ మార్మోగింది. మన్నాడే సుమధుర స్వరం నుంచి జాలువారిన గీతాల సంఖ్య అక్షరాల మూడువేలా ఐదు వందల పైమాటే. 1943లో వచ్చిన 'తమన్నా' చిత్రం ద్వారా ఆయన చిత్ర పరిశ్రమలోకి నేపథ్య గాయకునిగా అరంగ్రేటం చేశారు. 1950లో 'మషాల్‌' చిత్రంలో ఆయన పాడిన 'ఊపర్‌ గగన్‌ విశాల్‌' గీతానికి విశేషమైన ఆదరణ లభించింది.

ఆ గీతం హిందీ చిత్రసీమలో తిరుగులేని నేపథ్యగాయకునిగా ఆయన్ని నిలబెట్టింది. కిశోర్‌ కుమార్‌ వంటి గాయకులతో కలిసి 'యే దోస్తీ హమ్‌ నహీ-షోలే', 'ఏక్‌ చతుర్‌ నార్‌-పడోసన్‌' వంటి బృందగీతాలను కూడా మన్నాడే ఆలపించారు. కొన్ని సందర్భాల్లో హేమంత్‌ కుమార్‌తో కలిసి కూడా ఆయన గేయలాపన చేశారు. 'యారీ హై ఇమాన్‌ మేరా యార్‌ మేరి జిందగీ- జంజీర్‌' వంటి సుమధుర గేయాలు ప్రేక్షకులని బాగా అలరించాయి. అంతేకాదు బెంగాలీ చిత్రాలకు కూడా ఆయన నేపథ్యగానం చేశారు. బెంగాలీ చిత్రం 'సంఖ్యాయాబేలా'లో లతామంగేష్కర్‌తో కలిసి ఆయన పాడిన యుగళగీతం 'కే ప్రోథోమ కఛ్చే ఇసేఛీ' అత్యంత జనాదరణ పొందింది.

మన్నాడేకు ఫాల్కే పురస్కారం లభించడం పట్ల ప్యారేలాల్‌, కవితా కృష్ణమూర్తి, అనూ మాలిక్‌ తదితర సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

లక్షీకాంత్‌-ప్యారేలాల్‌గా ఖ్యాతిపొందిన సంగీత దర్శక ద్వయంలోని ప్యారేలాల్‌ తన స్పందన వ్యక్తం చేస్తూ 'మన్నాడేకు ఈ పురస్కారం లభించడం ఆనందదాయకం. నేను ఆయనతో కలిసి ఎన్నో గీతాలకు పనిచేశాను. ఆయనకు ఈ పురష్కారం ఎప్పుడో రావాల్సింది. ఆలస్యంగానైనా వచ్చినందుకు సంతోషంగా ఉంది.' అని ప్యారేలాల్‌ హర్షం వ్యక్తం చేశారు. 'ఆయన నాక తండ్రిలాంటివారు. మనం ఆయన సమక్షంలో ప్రదర్శన ఇస్తే కెరిర్‌లో ఉచ్ఛస్థితికి చేరుతామనడంలో సందేహం లేదు. శాస్త్రీయ సంగీతాన్ని అనునిత్యం అధ్యయనం చేస్తూ సామాన్యుల చెంతకు తీసుకెళ్లడంలో లబ్ధ ప్రతిష్టులు. ఆయనకు ఈ పురస్కారం రావడం ఎంతో సంతోషాన్ని కల్గిస్తోంది' అని గాయని కవితా కృష్ణమూర్తి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మన్నాడేకు అవార్డు రావడం పట్ల గాయకుడు అభిజీత్‌, సంగీత దర్శకుడు అనుమాలిక్‌ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అవార్డులు
1970 - నేపథ్యగాయకునిగా జాతీయ పురస్కారం - బెంగాలీ చిత్రం నిషిపద్మ
1971 - నేపథ్య గాయకునిగా జాతీయ పురస్కారం- హిందీ చిత్రం మేరే నామ్‌ జోకర్‌
1971 - పద్మశ్రీ - భారత ప్రభుత్వం
1985 - లతామంగేష్కర్‌ పురస్కారం-మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం
2001 - ఆనందలోక్‌ అవార్డు-ఆనందబజార్‌ గ్రూప్‌
2003 - అల్లావుద్దీన్‌ ఖాన్‌ అవార్డు-పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం
2004 - జాతీయ పురస్కారం-కేరళ ప్రభుత్వం
2005 - జీవిత సాఫల్య పురస్కారం-మహారాష్ట్ర ప్రభుత్వం
2005 - పద్మభూషణ్‌-భారత ప్రభుత్వం


No comments:

Post a Comment